Cauliflower Snack : క్యాలీప్లవర్.. ఇది మనందరికి తెలిసిందే. దీనితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే క్యాలీప్లవర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. క్యాలీప్లవర్ తో తరచూ చేసే కూరలు, పచ్చళ్లు, గోబి 65, ఫ్రై వంటి వాటినే కాకుండా కె ఎఫ్ సి స్టైల్ లో క్రిస్పీ క్యాలీప్లవర్ ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసే క్యాలీప్లవర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ క్యాలీప్లవర్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ క్యాలీప్లవర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన క్యాలీప్లవర్ – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర చెక్క, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్రిస్పీ క్యాలీప్లవర్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ముక్కలను నీటిలో వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వీటిని తీసి చల్లటి నీటిలో వేసుకోవాలి. తరువాత ముక్కలను వడకట్టి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులో నూనె, బ్రెడ్ క్రంబ్స్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని చల్లుకుంటూ పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత ఈ ముక్కలను బ్రెడ్ క్రంబ్స్ లో డిప్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ముక్కలకు బ్రెడ్ క్రంబ్స్ చక్కగా పట్టించిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలను నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ క్యాలీప్లవర్ ఫ్రై తయారవుతుంది. దీనిని స్నాక్స్ గా లేదా సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది.