Chepala Ulli Karam : చేప‌ల ఉల్లికారం.. ఇలా చేస్తే మొత్తం లాగించేస్తారు..!

Chepala Ulli Karam : చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చేప‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చేప‌ల పులుసు, చేప‌ల ఇగురు, చేప‌ల వేపుడు ఇలా అనేక వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చేప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా ఉల్లికారం వేసి చేసే చేప‌ల వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు కూడా. ఉల్లికారం వేసి చేప‌ల వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేప‌ల ఉల్లికారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ఉల్లిపాయ‌లు – 2, మెంతులు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీస్పూన్, ధ‌నియాలు – 2 టీస్పూన్స్, అల్లం- అర ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 9, నూనె – 4 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ట‌మాటాలు – 2, ఉప్పు- త‌గినంత‌, కారం – 2 టీ స్పూన్స్, ప‌సుపు – పావు టీ స్పూన్.

Chepala Ulli Karam recipe in telugu very tasty easy to make
Chepala Ulli Karam

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు -అర కిలో, కారం – అర టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీస్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్.

చేప‌ల ఉల్లికారం త‌యారీ విధానం..

ముందుగా చేప ముక్క‌ల‌ను ఉప్పు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత వీటిని నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిని అర గంట నుండి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ‌ల‌ను మంట‌పై కాల్చుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత పై ఉండే పొట్టును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో మెంతులు, జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు వేసి వేయించాలి. త‌రువాత వీటిని కూడా జార్ లో వేసి పొడిగా చేసుకోవాలి. అలాగే ట‌మాట ముక్క‌ల‌ను కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. వీటిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట పేస్ట్ వేసి వేయించాలి.

దీనిని కూడా నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత చేప ముక్క‌ల‌ను క‌ళాయి అంతా స‌మానంగా ప‌రుచుకోవాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి మూత‌లో నీటిని పోయాలి. ఈ ముక్క‌ల‌ను 4 నిమిషాల పాటు మ‌గ్గించిన త‌రువాత మూత తీసి ముక్క‌ల‌ను మ‌రో వైపుకు తిప్పుకోవాలి. త‌రువాత మ‌ర‌లా మూత‌ను ఉంచి మ‌రో 4 నిమిషాల పాటు మగ్గించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చేప‌ల ఉల్లికారం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts