Chicken Fry : మనం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పత్తుల్లో చికెన్ కూడా ఒకటి. చికెన్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ తోపాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. చికెన్ ను తగిన మోతాదులో తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చికెన్ తో రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటల్లో చికెన్ ఫ్రై కూడా ఒకటి. తరచూ చేసే చికెన్ ఫ్రై కి బదులుగా కింద చెప్పిన విధంగా చేసే చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ ఫ్రై ని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒకటీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), పెరుగు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత గిన్నెపై మూత ఉంచి ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత చికెన్ ను బయటకు తీసి ఒకసారి అంతా బాగా కలపాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఈ చికెన్ మొత్తాన్ని వేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు వేయించాలి. చికెన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత మరో కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత సాజీరాను, పచ్చి మిర్చిని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి అవి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన చికెన్ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత చికెన్ ముక్కలను బాగా కలిపి మరో 5 నుండి 10 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై తయారువుతుంది. ఇలా తయారు చేసుకున్న చికెన్ ఫ్రై ని అన్నం, రోటీ, చపాతీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.