Turmeric : భారతీయ సంప్రదాయంలో పసుపుకు విశేష ప్రాధాన్యత ఉంది. భారతీయులు సుమారుగా 3 వేల సంవత్పరాలుగా పసుపును పూజా సామాగ్రిగా, ఔషదంగా, సౌందర్య సాధనంగా, వంటల తయారీలో.. ఇలా పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు ఏ ఆచారాన్ని ఆచరణలో తెచ్చినా దాని వెనుక ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. నిత్య జీవితంలో పసుపును వాడడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు మనకు ప్రకృతి ప్రసాదించిన అపర సంజీవని వంటిదని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పసుపులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తోపాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా పసుపులో క్యాన్సర్ బారిన పడకుండా చేసే లక్షణాలు కూడా ఉంటాయి. మన ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కూడా పసుపు మనకు ఉపయోగపడుతుంది. పసుపులోని ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకునే ఆచారాన్ని తీసుకువచ్చారు. కాళ్లకు మాత్రమే పసుపు ఎందుకు రాసుకోవాలి అనే సందేహాలు కూడా మనకు రావచ్చు. దీని వెనుక కూడా ఆరోగ్య రహస్యం ఉంది.
స్త్రీలు ఎక్కువగా నీళ్లలో పని చేస్తారు. కాళ్లకు పసుపును రాసుకోవడం వల్ల నీళ్లలో, నేల మీద ఉండే క్రిములు వారిలోకి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే శరీరంలో అధికంగా ఉండే వేడిని తగ్గించి కాళ్లు పగలకుండా ఉంటాయి. అదే విధంగా మనం ఇంట్లో గడపలకు పసుపు రాస్తూ ఉంటాం. దీని వెనుక కూడా ఒక ఆరోగ్యకరమైన ప్రయోజనం ఉంది. గడపలకు పసుపు రాయడం వల్ల హానికారక సూక్ష్మ క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. క్రిములు ఇంట్లోకి రాకుండా పసుపు నిరోధిస్తుంది. తద్వారా ఇంట్లోని వారు రోగాల బారిన పడకుండా ఉంటారు. గాయాలు తగిలినప్పుడు వెంటనే పసుపును రాయడం వల్ల పసుపు యాంటీ సెప్టిక్ గా పని చేసి గాయాలు త్వరగా మానుతాయి. మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పడితే దగ్గు, జలుబు వంటి వ్యాధులు నయం అవుతాయి.
వేడి పాలలో పసుపును కలుపుకుని తాగడం వల్ల కఫం తొలగిపోతుంది. పసుపును, వేపాకును కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల మీద రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపును, ఉప్పును కలిపి ఆ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల సమస్యలు నయం అవుతాయి. వేడి పాలలో పసుపును, మిరియాల పొడిని కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపును, గంధాన్ని, పెరుగును సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ఆముదంలో కొద్దిగా పసుపును కలిపి శరీరానికి రాసుకుని ఒక పావు గంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై ఉండే మచ్చలు, దద్దుర్లు, చర్మ వ్యాధులు తొలగిపోతాయి. కొత్తిమీర రసంలో పసుపును కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడంతోపాటు చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ విధంగా పసుపు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.