Chitti Pesarattu : మనం పొట్టు పెసరపప్పుతో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. ఈ పొట్టు పెసరపప్పుతో మనం ఎక్కువగా పెసర దోశలను, పెసర అట్టును తయారు చేస్తూ ఉంటాం. ఈ పెసర దోశలు కానీ అట్టు కానీ చాలా రుచిగా ఉంటాయి. ఈ పెసరట్టును మరింత రుచిగా కాకినాడ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు పెసరపప్పు – 3 టీ గ్లాసులు, అల్లం – రెండు ఇంచుల ముక్క, పచ్చిమిర్చి – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- తగినంత, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర – అర టీ స్పూన్.
ధనియాల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – రెండు టీ స్పూన్స్, ఎండుమిర్చి – 20 లేదా తగినన్ని, ధనియాలు – ఒక కప్పు, జీలకర్ర – పావు కప్పు, కరివేపాకు – గుప్పెడు, ఇంగువ – రెండు చిటికెలు, ఉప్పు – తగినంత, చింతపండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 10.
కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత పప్పును బాగా కడగాలి. తరువాత దీని నుండి గుప్పెడు పప్పును తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పప్పును జార్ లో వేసుకోవాలి. దీనిలో అల్లం ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కలిపి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేసుకోవాలి. కరివేపాకు వేగిన తరువాత ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లగా అయ్యే వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించిన ఎండుమిర్చిని వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే వేయించిన ధనియాలను, ఉప్పును, చింతపండును, వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసుకోవాలి. తరువాత పిండిని ఒక గంటె మోతాదులో తీసుకుని అట్టులా మందంలా వేసుకోవాలి. తరువాత దీనిపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న కారాన్ని చల్లుకోవాలి. తరువాత పక్కకు తీసి పెట్టుకున్న పెసరపప్పును చల్లుకోవాలి. ఇలా అన్ని వేసిన తరువాత అట్టుపై నూనె వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిట్టి పెసరట్టు తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే పెసరట్టు కంటే కూడా ఇలా చేసిన పెసరట్టు మరింత రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే పెసరట్టు కోసం తయారు చేసిన ధనియాల కారాన్ని ఇతర పదార్థాల్లో కూడా ఉపయోగించవచ్చు.