Thyroid Diet : థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు ఎలాంటి ఆహారాల‌ను తీసుకోవాలి.. వేటిని తిన‌కూడ‌దు..?

Thyroid Diet : ఆధునిక కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య కూడా ఒక‌టి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య కార‌ణంగా ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. థైరాయిడ్ లో హైపర్ థైరాయిడిజం అలాగే హైపో థైరాయిడ్ అనే రెండు ర‌కాలు ఉంటాయి. ఈ థైరాయిడ్ స‌మ‌స్య కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందుల‌ను వాడిన‌ప్ప‌టికి కొంద‌రిలో థైరాయిడ్ స‌మ‌స్య నియంత్ర‌ణ‌లో ఉండ‌దు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మందుల‌ను వాడుతూ ఆహార నియ‌మాల‌ను కూడా పాటించాలి. అప్పుడే థైరాయిడ్ స‌మ‌స్య నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

థైరాయిడ్ వ్యాధి గ్ర‌స్తులు పాటించాల్సిన ఆహార నియ‌మాల గురించి అలాగే వారు తిన‌కూడ‌ని ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి విడుద‌ల చేసే హార్మోన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు హైపో థైరాయిడ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీని కార‌ణంగా బ‌రువు పెర‌గ‌డం, జుట్టు రాల‌డం, చ‌ర్మం పొడిబార‌డం, గుండె నెమ్మ‌దిగా కొట్టుకోవ‌డం, శ‌రీరంలో చెడు కొవ్వు పేరుకుపోవ‌డం, కండ‌రాల నొప్పులు, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఈ హైపో థైరాయిడిజంతో బాధ‌ప‌డే వారు అయోడిన్ ఉన్న ఉప్పును తీసుకోవాలి. అయోడిన్ ను మ‌న శ‌రీరం త‌యారు చేసుకోలేదు కాబ‌ట్టి అయోడిన్ ఉన్న ఆహారాల‌ను తీసుకోవాలి.

Thyroid Diet know which foods have to eat which not
Thyroid Diet

ఈ హైపో థైరాయిడిజంతో బాధ‌ప‌డే వారు చేప‌ల‌ను, ఆలివ్ నూనెను, కోడిగుడ్డును ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే హైపో థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఫ్యాట్ త‌క్కువ‌గా ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇక హైపో థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఉడికించిన స‌గం ఉడికించిన ఆకుకూర‌ల‌ను అస్స‌లు తీసుకోకూడదు. గ్రీన్ టీ ని ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు. అలాగే సోయా ఉత్ప‌త్తుల‌ను, క్యాలీ ప్ల‌వ‌ర్, క్యాబేజీ, బ్రొకోలి వంటి వాటిని కూడా తీసుకోకూడదు. అదేవిధంగా చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ట్ ఫుడ్ వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

అదే విధంగా థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల‌ల‌ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేయ‌డం వ‌ల్ల హైప‌ర్ థైరాయిడిజం స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవ‌డం చాలా మంచిది. బ్రొకోలి, బ‌చ్చ‌లి కూర‌, క్యారెట్, ముల్లంగి, పాల‌కూర‌, క్యాబేజ్ వంటి వాటిని తీసుకోవ‌డం మంచిది. ఈ హైప‌ర్ థైరాయిడిజంతో బాధ‌ప‌డే వారు హెర్బ‌ల్ టీ ల‌ను తాగ‌డం మంచిది. అలాగే బ్రౌన్ రైస్, చిరు ధాన్యాల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం. అలాగే నీటిని ఎక్కువ‌గా తాగుతూ ఉండాలి. మందుల‌ను వాడుతూ ఈ ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం వల్ల థైరాయిడ్ స‌మ‌స్య ఇబ్బందిక‌రంగా మార‌కుండా ఉంటుంది.

D

Recent Posts