Joint Pain : బీడు భూముల్లో, రోడ్లకు ఇరు వైపులా, పొలాల దగ్గర విరివిరిగా పెరిగే మొక్కల్లో తలంబ్రాల మొక్క ఒకటి. దీనిని అత్తా కోడళ్ల చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్క మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క ఒక పొదలా పెరుగుతుంది. పంట పొలాలకు పురుగు పట్టకుండా ఈ చెట్టును పొలాల చుట్టూ పెంచుతూ ఉంటారు. ఈ మొక్క లాంటానా అనే జాతికి చెందిన మొక్క. వీటిలో 150 కు పైగా జాతులు ఉంటాయి. తలంబ్రాల మొక్క పూలు వివిధ రంగుల్లో చిన్నగా చాలా అందంగా ఉంటాయి. ఈ మొక్కను ఉపయోగించి ఫర్నీచర్, కంచెలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే బుట్టలు, గంపలు అల్లడానికి కూడా ఈ మొక్కను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ తలంబ్రాల మొక్కను చాలా మంది కలుపు మొక్కగా, పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు.
కానీ ఈ మొక్కలో కూడా ఔషధ గుణాలు ఉంటాయని దీనిని ఉపయోగించడం వల్ల పలు రకాల నఅనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని మనలో చాలా మందికి తెలియదు. ఈ మొక్క కాయలను కొన్ని ప్రాంతాల్లో తింటూ ఉంటారు. కానీ ఈ కాయల్లో ఒకరకమైన విషం ఉంటుందని అనేక రకాల పరిశోధనల్లో తేలింది. కనుక ఈ కాయలను తినకపోవడమే మంచిది. చర్మ సంబంధిత సమస్యలను, ఉబ్బసం, నోటి పూత, కుష్టు వ్యాధి, చికెన్ పాక్స్, క్యాన్సర్ వంటి సమస్యలకు ఉపయోగించే ఔషధాల తయారీలో ఈ మొక్కను ఉపయోగిస్తారు. తలంబ్రాల మొక్క ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ మొక్క ఆకులను ఉపయోగించి మనం గాయాలను నయం చేసుకోవచ్చు. తలంబ్రాల మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ పేస్ట్ ను గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆస్థమాను నయం చేయడంలో కూడా ఈ మొక్క మనకు ఉపయోగపడుతుంది. నీటిలో తలంబ్రాల మొక్క ఆకులను వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటితో ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ మొక్కకు విష ప్రభావాన్ని తగ్గించే శక్తి కూడా ఉంది. పాము కాటుకు గురి అయినప్పుడు ఈ మొక్క ఆకుల నుండి రసాన్ని తీసి పాము కాటుకు గురి అయిన చోట రాయడం వల్ల విష ప్రభావం కొంత మేర తగ్గుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఆయుర్వేదంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను వేడి చేసి కీళ్ల నొప్పులపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా రోజూ చేస్తూ ఉండడం వల్ల క్రమంగా నొప్పులు తగ్గుతాయి. అలాగే తలంబ్రాల మొక్కలను ఆముదంతో కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులపై ఉంచి కట్టుకట్టాలి.
రాత్రి పడుకునే ముందు ఈ కట్టుకట్టి ఉదయాన్నే తీసి వేయాలి. ఇలా నెల రోజుల పాటు చేయడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. దోమలను నివారించడంలో కూడా తలంబ్రాల మొక్క ఆకులు మనకు ఉపయోగపడతాయి. ఈ మొక్కలను కాల్చి ఇంట్లో ధూపంలా వేయడం వల్ల దోమలు నశిస్తాయి. ఈ మొక్క పూలను కూడా క్షయ వ్యాధికి తయారు చేసే సాంప్రదాయ ఔషధాల్లో విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ విధంగా తలంబ్రాల మొక్క మనకు ఎంతో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.