Chitti Punugulu : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో చిట్టి పునుగులు ఒకటి. చిట్టి పునుగులు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బండ్ల మీద లభించే విధంగా ఉండే ఈ చిట్టి పునుగులను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ చిట్టి పునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిట్టి పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, బియ్యం – 3 కప్పులు, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చిట్టి పునుగుల తయారీ విధానం..
ముందుగా మినపప్పును, బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ మినపప్పును ఒక జార్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి 8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. పిండి చక్కగా పులిసిన తరువాత వంటసోడా, జీలకర్ర, బియ్యం పిండి, మైదాపిండి, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని ఒక పక్క నుండి తీసుకుంటూ గోళి అంత పరిమాణంలో పునుగులను నూనెలో వేసుకోవాలి.
వీటిని గంటెతో అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిట్టి పునుగులు తయారవుతాయి. వీటిని టమాట చట్నీ, పల్లి చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ పునుగుల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ పునుగులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.