Cauliflower Tomato Curry : మనం వంటింట్లో టమాటాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. టమాటలను నేరుగా లేదా వివిధ కూరగాయలతో కలిపి కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేసే కూరలల్లో కాలీఫ్లవర్ టమాట కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందని మనందరికీ తెలుసు. అంతే కాకుండా కాలీఫ్లవర్ ను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. గర్భిణీలకు కూడా కాలీఫ్లవర్ ఎంతో మేలు చేస్తుంది.
వీటితోపాటు కాలీఫ్లవర్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కనుక కాలీఫ్లవర్ ను అందరూ తప్పకుండా ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం తరచూ చేసే కాలీఫ్లవర్ టమాట కూరలో కసూరి మెంతిని వేసి మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు. కసూరి మెంతిని వేసి కాలీఫ్లవర్ టమాట కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ టమాట కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన కాలీఫ్లవర్ – 200 గ్రా., టమాటాలు – 2 (పెద్దవి), కసూరి మెంతి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒకటి, యాలకులు – 2, లవంగాలు – 3, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 2, ఉల్లిపాయ పేస్ట్ – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లులి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – రుచికి తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – 1 టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కాలీఫ్లవర్ టమాట కూర తయారీ విధానం..
ముందుగా అర లీటర్ నీళ్లను బాగా వేడి చేసి తరిగిన కాలీఫ్లవర్ ను వేసి 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్‌లో ఉండే పురుగులు, మలినాలు అన్నీ పోతాయి. టమాటాలను ముక్కలుగా చేసి జార్ లో వేసి పేస్ట్ లా చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపపప్పు వేసి వేయించిన తరువాత పచ్చి మిర్చి, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ , కరివేపాకు వేసి వేయించాలి.
ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా వేగిన తరువాత టమాట ప్యూరీ, పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. 5 నిమిషాల తరువాత ఉడికించిన కాలీఫ్లవర్ ను, తగినన్ని నీళ్లను పోసి కలిపిన తరువాత కసూరి మెంతిని వేసి మరోసారి కలిపి మూతపెట్టి కాలీఫ్లవర్ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికిన తరువాత కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ టమాట కూర తయారవుతుంది. ఈ కూర తయారీలో కసూరి మెంతికి బదులుగా మెంతి ఆకులను కూడా వేసుకోవచ్చు. ఈ కూరను అన్నంతో కంటే చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే కాలీఫ్లవర్ టమాట కూరకు బదులుగా ఇలా కసూరి మెంతిని వేసి చేసిన కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.