Kali Yugam : ఈ అనంత కాల చక్రంలో యుగాలు నాలుగు. అవి సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగం. వీటిలో ఇప్పటికి మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలి యుగం నడుస్తోంది. కలియుగం గడవగానే మరలా కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుంది. సత్య యుగాన్నే కృత యుగం అని కూడా పిలుస్తారు. కృతం అంటే పరిపూర్ణం అని అర్థం. ఈ యుగంలో అన్నీ పుష్కలంగా, పరిపూర్ణంగా జనులకు అందుతాయి. ఈ సత్య యుగాల గురించి బ్రహ్మ, మార్కేండయ పురాణాల్లో విపులంగా వివరించబడింది. మరి సత్యయుగం ఎలా ఉండబోతుంది.. కలియుగం ఎలా అంతమై సత్యయుగం ప్రారంభమవబోతుంది.. అప్పటి మనుషులు ఎలా ఉంటారు.. వంటి తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కలియుగాంతానికి వచ్చేటప్పటికి ధర్మం అనేది పూర్తిగా నశించిపోతుంది. అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోతాయి. వావివరుసలు లేకుండా స్త్రీ, పురుషులు దారి తప్పుతారు. తల్లిదండ్రులను పట్టించుకోరు. భార్యను భర్త చూడడు. భర్తను భార్య పట్టించుకోకుండా తన సుఖం తాను చూసుకుంటుంది. ప్రజలు విచిత్ర వ్యాధుల బారిన పడి పిట్టలు రాలినట్టు రాలిపోతుంటారు. కలి ప్రభావం వల్ల దైవ భక్తి పూర్తిగా నశించి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే విచ్చలవిడి తనం పెరిగిపోతుంది. ఆకస్మిక ఉత్పాతాలు సంభవించి దేశాలకు దేశాలే కడలిలో కలసిపోతాయి.
సూర్యచంద్రులు దారి తప్పుతారు. నక్షత్రాలు కళావిహీనం అవుతాయి. అప్పటికి మానవుని అయుష్షు వంద సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు చేరుకుంటుంది. ఆ సమయంలో షంబడ అనే నగరంలో విష్ణుయశుడు అనే బ్రహ్మణుడికి కల్కి అనే అవతారంలో శ్రీ మహా విష్ణువు పదవ అవతారంగా జన్మించి కలిని అంతం చేయడంతో పెద్ద ప్రళయం సంభవించి ఈ కలియుగం అంతమవుతుంది. కలియుగం అంతం కావడంతో కాలచక్రంలో మొదటి యుగమైన సత్య యుగం మరలా ప్రారంభమవుతుంది. ఈ యుగం యొక్క కాల పరిమాణం 17, 28,000 సంవత్సరాలు.
సత్య యుగంలో కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. తిండి, నీరు, బట్ట, గూడు ఇలా వేటికీ లోటు ఉండదు. అందరికి అన్నీ పుష్కలంగా దొరుకుతాయి. ఈ యుగంలో అన్నీ పరిపూర్ణంగా లభించడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం భగవన్నాస్మరణలో గడుపుతారు. యజ్ఞ యాగాలు నిర్వహిస్తారు. దేవతలు కూడా దేవతా లోకం నుండి భూమి మీదకు వచ్చి ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటారు. సత్య యుగంలో ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం ఉండడంతో వ్యాధులనేవే దరి చేరవు. ఈ యుగంలో సగటు మనుషుల ఆయుర్ధాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది. ఎత్తు పదకొండు అడుగుల వరకు పెరుగుతారు.
సత్య యుగంలో ఎండాకాలం, చలికాలం అనేవి ఉండవు. కేవలం వానాకాలం మాత్రమేఉంటుంది. వర్షాలు కూడా ఎంత వరకు అవసరమో అంతే కురుస్తాయి. ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది. జ్ఞానం, ధ్యానం, తపస్సు ఈ మూడింటిపైనే వీరు దృష్టిని నిలుపుతారు. అహింస, దొంగతనాలు, అకృత్యాలు అసలే ఉండవు. ఆయుధాలతో పనే ఉండదు. సత్య యుగంలో అసలు ధనం పైన వ్యామోహమే ఉండదు. ప్రజలందరూ అలుపు సలుపు లేకుండా ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఎవరికి ఎంత అవసరమో అంత పండించుకుంటూ వారి అవసరార్థం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు.
వీరి ధ్యాస మొత్తం భగవంతుడి పైనే ఉంటుంది. అకాల మరణాలు అనేవే ఉండవు. వారి ఆయుర్థాయం ముగియగానే వారే స్వయంగా పుణ్యలోకాలకు పయనమవుతారు. ఎలాంటి ఆకస్మిక ఉత్పాతాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు. అడవిలో ఉండే జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారిలో కలసి పోతాయి. సత్య యుగంలో మానవులు తమ తపో శక్తితో భగవంతుడితో నేరుగా సంభాషిస్తారు. ఈ విధంగా రాబోయే సత్య యుగం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనం కూడా ఈ సత్య యుగంలో జన్మించాలంటే ఇప్పటి నుండే ఎదుటివారికి సహాయం చేస్తూ అవసరమైన వారికి దానధర్మాలు చేస్తూ మంచి మనసుతో భగవంతుని నామస్మరణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సత్యయుగంలో మళ్లీ జన్మిస్తారు.