Egg Sandwich : మనం బ్రెడ్ తో చేసే స్నాక్ ఐటమ్స్ లో సాండ్విచ్ కూడా ఒకటి. సాండ్విచ్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. సాండ్విచ్ లో అనేక రకాలు ఉంటాయి. వాటిలో ఎగ్ సాండ్విచ్ కూడా ఒకటి. ఎగ్ తో చేసే ఈ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా, స్నాక్ గా తీసుకోవడానికి అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ సాండ్విచ్ చాలా చక్కగా ఉంటుంది. దీనిని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈ సాండ్విచ్ ను తయారు చేసుకోవచ్చు. ఎంతో సులభంగా , చాలా తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ ఎగ్ సాండ్విచ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ సాండ్విచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్డు – 1, ఉప్పు – కొద్దిగా, మిరియాల పొడి – చిటికెడు, క్యాబేజి తరుగు – అర కప్పు, క్యారెట్ చీలికలు – పావు కప్పు, మయనీస్ – 2 టేబుల్ స్పూన్స్, సాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ – 4.
ఎగ్ సాండ్విచ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో కోడిగుడ్డును పగలకొట్టి వేసుకోవాలి. దీనిని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా చిన్న ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ను చిన్న మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత దానిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి. ఇలా ఆమ్లెట్ ను కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకున్న తరువాత గిన్నెలో క్యాబేజి తురుము, క్యారెట్ చీలికలు, మయనీస్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని అంచులను తీసి వేయాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ ను తీసుకుని వాటిపై మయనీస్ ను రాసుకోవాలి. తరువాత వాటిపై క్యాబేజి మిశ్రమాని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపై ఆమ్లెట్ ను వేసుకోవాలి. ఇప్పుడు మయనీస్ రాసిన మరో బ్రెడ్ ను దానిపై ఉంచి మధ్యలోకి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ సాండ్విచ్ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన ఎగ్ సాండ్విచ్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.