Ganti Pidikillu : పాత‌కాలం నాటి వంట ఇది.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయాలి..!

Ganti Pidikillu : గంటి పిడికిళ్లు… స‌జ్జ‌ల‌తో చేసే పాత కాల‌పు తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. ఈ పిడికిళ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. అలాగే ఎదిగిన ఆడ‌పిల్ల‌ల‌కు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో నెల‌స‌రి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే రక్త‌హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది. ఈ గంటి పిడికిళ్ల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇంట్లో స‌జ్జ‌లు ఉండే చాలు వీటిని నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ గంటి పిడికిళ్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గంటి పిడికిళ్లు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌జ్జ‌లు – ఒక‌టిన్న‌ర క‌ప్పులు, బెల్లం తురుము- ముప్పావు క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, ఉప్పు – చిటికెడు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – పావు క‌ప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్.

Ganti Pidikillu recipe in telugu make in this method
Ganti Pidikillu

గంటి పిడికిళ్లు త‌యారీ విధానం..

ముందుగా ఒక స‌జ్జ‌ల‌ను శుభ్రంగా క‌డిగి తగిన‌న్ని నీళ్లు పోసి రాత్రంతా నాన‌బెట్టుకోవాలి. ఇలా నాన‌బెట్టుకున్న త‌రువాత వాటిని వ‌డ‌క‌ట్టి త‌డి వ‌స్త్రంపై వేసి 15 నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని జార్ లో వేసుకుని మెత్తని పొడిలా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన త‌రువాత దానిని వ‌డ‌క‌ట్టి మ‌ర‌లా క‌ళాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని నురుగు వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ఉప్పు, యాల‌కుల పొడి, ప‌చ్చికొబ్బ‌రి తురుము, నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న స‌జ్జ పిండి వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయికి అంటుకోకుండా వేర‌య్యే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మం చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత వీటిని ఆవిరి మీద ఉడికించడానికి ఒక గిన్నెలో లీట‌ర్ నీటిని పోసి దానిపై చిల్లుల గిన్నెను ఉంచి అందులో అర‌టి ఆకును ఉంచాలి. మూత పెట్టి నీళ్లు మ‌రిగే వ‌ర‌కు వేడి చేయాలి. నీళ్లు మ‌రిగే లోపు స‌జ్జ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముందు ఉండ‌లాగా చేసుకోవాలి. త‌రువాత వీటిని పిడికిలి ఆకారంలో వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత వీటిని అర‌టిఆకుపై ఉంచి మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మూత తీసి పిడికిళ్ల‌ను బ‌య‌ట‌కు తీసి పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే గంటి పిడికిళ్లు త‌యార‌వుతాయి. వీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల ప‌ది రోజుల పాటు తాజాగా ఉంటాయి. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా స‌జ్జ‌ల‌తో పిడికిళ్ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts