చేప‌ల కూర‌ను ఒక్క‌సారి ఇలా వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Fish Curry : ప్ర‌స్తుత కాలంలో చేప‌ల కూర‌ను ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తులల్లో త‌యారు చేస్తున్నారు. అలాగే అనేక ర‌కాల మ‌సాలాల‌ను వాడుతూ ఉన్నారు. ఎన్ని ర‌కాల మ‌సాలాలు వేసిన‌ప్ప‌టికి కూర మాత్రం రుచిగా ఉండ‌డం లేదు. అయితే పాత కాలంలో మాత్రం చాలా త‌క్కువ మ‌సాలాతో చాలా సుల‌భంగా చేప‌ల కూర‌ను త‌యారు చేసేవారు. త‌క్కువ మ‌సాలాలు వేసిన‌ప్ప‌టికి కూర మాత్రం చిక్క‌గా, చాలా రుచిగా , క‌మ్మ‌గా ఉండేది. చేప‌లు తిన‌ని వారు కూడా ఈ విధంగా త‌యారు చేసిన కూర‌ను ఇష్టంగా తినేవారు. మ‌నం కూడా త‌క్కువ మ‌సాలాల‌తో చేప‌ల కూర‌ను సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. త‌క్కువ మ‌సాలాల‌తో, రుచిగా చేప‌ల‌కూర‌ను పాత‌కాలంలో చేసిన‌ట్టుగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చేప‌ల కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, వేయించిన మెంతులు – పావు టీ స్పూన్, వెల్లుల్లి – 10 నుండి 15, త‌రిగిన ఉల్లిపాయ – పెద్ద‌ది ఒక‌టి, చేప‌లు – ఒక కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 3 నుండి 4 టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, వేరుశ‌న‌గ నూనె – 5 టీ స్పూన్స్, వెన్న – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

make fish curry like this once
fish curry

చేప‌ల కూర త‌యారీ విధానం..

ముందుగా రోట్లో మెంతుల‌ను వేసి మెత్త‌గా దంచుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి.త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను కూడా రోట్లో వేసి మెత్త‌గా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కూర వండ‌డానికి స‌రిప‌డా మ‌ట్టిపాత్ర‌ను తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చేప ముక్క‌ల‌ను వేసుకోవాలి. త‌రువాత దంచిన ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత ఈ చేప ముక్క‌ల‌ల్లో చింత‌పండు గుజ్జు, త‌గిన‌న్ని నీళ్లు పోసుకుని క‌ల‌పాలి.

త‌రువాత ఈ మ‌ట్టిపాత్ర‌ను స్ట‌వ్ మీద ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీనిని మ‌రోసారి అంతా క‌లుపుకుని మ‌ర‌లా మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించాలి. త‌రువాత దంచిన వెల్లుల్లి మిశ్ర‌మం, మ‌రో 3 ప‌చ్చిమిర్చి త‌రుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత వెన్న‌, కొత్తిమీర‌వేసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత రెండు క‌రివేపాకు రెమ్మ‌లు వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టాలి. ఈ కూర‌ను 2 నుండి 3 గంట‌ల పాటు అలాగే ఉంచిన త‌రువాత అన్న‌తో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే చేప‌ల కూర త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన చేప‌ల కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఎక్కువ మ‌సాలాలు లేకుండా సుల‌భంగా, రుచిగా కూడా చేప‌ల కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts