Gongura Tomato Kura : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. గోంగూరను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గోంగూర మనకు దోహదపడుతుంది. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడి, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా గోంగూరతో ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూర, టమాటలు కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, వెజ్ బిర్యానీ వంటి వాటిలోకి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ గోంగూర టమాట కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర టమాట కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 10 నుండి 15, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పెద్ద టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, గోంగూర కట్టలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి).
గోంగూర టమాట కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు చిన్న మంటపై మగ్గించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలను మగ్గించాలి. టమాట ముక్కలు పూర్తిగా మగ్గిన తరువాత గోంగూర ఆకులు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరను మగ్గించాలి. గోంగూర మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తితో గోంగూరను మెత్తగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి చిన్న మంటపై మూత పెట్టి ఉడికించాలి. గోంగూర పూర్తిగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర టమాట కూర తయారవుతుంది. ఈ కూరను తాళింపు కూడా చేయవచ్చు. ఇలా తయారు చేసిన గోంగూర టమాట కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.