ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతనమైన దేవాలయాలు మన దేశంలోనే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఎంతో పురాతన కాలం నుంచి హిందువులు దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం చేస్తున్నారు. ఇక ఉత్సవాలు వచ్చినప్పుడైతే భక్తుల్లో ఉండే కోలాహలం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుదామా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. ఇక పండుగలు వంటివి వస్తే దేవాలయాల్లో ఉండే రద్దీ అంతా ఇంతా కాదు. అయితే నిజంగా అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్తారో తెలుసా..? మన ఇండ్లలో కూడా దేవుళ్లు ఉంటారు. దేవాలయాల్లోనూ ఉంటారు. అలాంటప్పుడు ఆలయాలకే ఎందుకు వెళ్లి దేవుళ్లను పూజించాలి..? ఇంట్లోనే ఎందుకు పూజించకూడదు..? వీటికి కారణాలు తెలుసుకుందాం రండి.
ఏ ఆలయంలోనైనా ముందుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగాకే అందుకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మాణం చేస్తారు. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించిన చోట పాజిటివ్ శక్తి చాలా ఉంటుంది. అది గుడి ముఖ ద్వారం గుండా బయటికి వెళ్తుంది. కాబట్టి గర్భగుడికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. గర్భగుడిలో చాలా శక్తి ఉండడంతో అక్కడ సాక్షాత్తూ దేవుళ్లు, దేవతలు తిరుగుతారట. ఈ క్రమంలో అలాంటి పవిత్రమైన ప్రదేశంలో పాదరక్షలు వేసుకోకూడదట. అందుకే ఆలయాల్లోకి చెప్పులను అనుమతించరు. చెప్పులు వేసుకుని వెళ్లరు. ఇక దేవాలయాల్లో ఉండే గంట విషయానికి వస్తే ఆ గంటను మోగించడం వల్ల దాన్నుంచి వచ్చే ధ్వని 7 సెకండ్ల పాటు ఉంటుందట. ఈ క్రమంలో ఆ ధ్వని మన మెదడులో ఉన్న కుడి, ఎడమ భాగాలను ప్రేరిపిస్తుందట. దీంతో శరీరంలో ఉన్న 7 ప్రధాన వ్యాధి నిరోధక వ్యవస్థలు ఉత్తేజితమై, పటిష్టమవుతాయట. దీని వల్ల మనకు ఉన్న అనారోగ్యాలు నయమవుతాయట.
ఆలయాల్లో ఉన్న కుంకుమను నుదుటిపై రెండు కనుబొమ్మల మధ్య ధరిస్తే దాంతో మనకు పాజిటివ్ శక్తి లభిస్తుందట. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిలను పెంచుతుందట. ఆలయాల్లో గర్భగుడిలో కర్పూరాలను వెలిగించి స్వామివార్లకు హారతులు ఇస్తారు. ఆ సమయంలో వచ్చే పొగను పీలిస్తే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాదు, హారతి వెలుగులో స్వామివార్లను దర్శించుకోవడం మంచిదట. హారతిని చేతితో తీసుకుని దాన్ని కళ్లకు అద్దుకుంటే దాని వల్ల కళ్ల దగ్గర ఉండే నాడులు ఉత్తేజితమవుతాయట. బాగా సువాసనతో కూడిన పువ్వులను ఆలయాల్లో దేవుడి పూజ కోసం ఉపయోగిస్తారు కదా. వాటి నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల మన శరీరంలో పలు నాడులు ఉత్తేజితమై వివిధ రకాల వ్యాధులను తొలగించేందుకు ఉపయోగపడతాయట.
ఇక చివరిగా దేవాలయాల్లో స్వామి వార్లకు నైవేద్యాలుగా ఎక్కువగా కొబ్బరికాయ, అరటిపండ్లను పెడతారు కదా. నిజం చెప్పాలంటే వాటిలో ఎన్నో ఆరోగ్యకర రహస్యాలు దాగి ఉన్నాయి. అవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. వాటిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయట. పైన చెప్పిన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే దేవాలయాలకు వెళ్లడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, ఆలయాలకు కచ్చితంగా వెళ్లాలని. దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.