Green Chilli Dal : మనం చేసే ప్రతి వంటలో విరివిరిగా ఉపయోగించే వాటిల్లో పచ్చిమిర్చి కూడా ఒకటి. పచ్చిమిర్చి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటలు, పచ్చళ్ల తయారీలో వాడడంతో పాటు పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో చేసే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, తేలికగా పచ్చిమిర్చితో పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిరపకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 100 గ్రా., తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 8, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 7, కరివేపాకు – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
పచ్చిమిరపకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మూతపెట్టి పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత తరిగిన రెండు పచ్చిమిరపకాయలను వేసి వేయించాలి.
తాళింపు వేగిన తరువాత పప్పును వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి మిరపకాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.