Disti Boodida Gummadikaya : ఇంటికి దిష్టి త‌గ‌ల‌వ‌ద్ద‌ని బూడిద గుమ్మ‌డికాయ‌ను క‌డుతున్నారా.. అయితే ముందుగా ఇవి తెలుసుకోండి..

Disti Boodida Gummadikaya : న‌ర దిష్టికి నాప‌రాయి అయినా ప‌గులుతుంది అనే సామెత మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. అంటే మ‌న కంటి నుండి వ‌చ్చే నెగెటివ్ ఎన‌ర్జీ ఎదుటి వ‌స్తువుపై అంత‌టి ప్ర‌భావాన్ని చూపుతుందని ఈ సామెత అర్థం. కోపం వ‌స్తే క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌డం, బాధ వ‌స్తే క‌న్నీళ్లు రావ‌డం ఇలా మ‌న‌లోని భావాల‌న్నీ క‌ళ్ల ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. అంత‌టి శ‌క్తి క‌లిగిన క‌ళ్ల ద్వారా పాజిటివ్, నెగెటివ్ ఎన‌ర్జీలు రెండూ కూడా వెలువ‌డుతాయి. ఎదుటి వారి మీద అసూయ క‌లిగిన‌ప్పుడు వ‌చ్చే నెగెటివ్ ఎన‌ర్జీ ఆ వ్య‌క్తి మీద‌ ప‌డిన‌ప్పుడు క‌ళ్లు తిర‌గ‌డం, తీవ్రంగా త‌ల‌నొప్పి రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీనినే దిష్టి అంటారు.

ఈ దిష్టి అనేది మ‌నుషుల‌కే కాకుండా వ‌స్తువుల‌కు, ఇళ్లకు, వ్యాపారానికి కూడా త‌గులుతుంది. ఈ దిష్టి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఒక్కో దానికి ఒక్కో ర‌క‌మైన ప‌రిష్కారం ఉంటుంది. మనుషుల‌కు త‌గిలే దిష్టిని పోగొట్ట‌డానికి ఉప్పు తిప్ప‌డ‌మో, నూనె గుడ్డ తిప్ప‌డ‌మో చేస్తూ ఉంటాం. దీని వ‌ల్ల దిష్టి ప్ర‌భావం కొంత త‌గ్గుతుంది. అలాగే మ‌నం ఎంతో ముచ్చ‌టి ప‌డి క‌ట్టుకున్న ఇంటికి కూడా దిష్టి త‌గులుతుంది. ఈ దిష్టి ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికి ఇంటి సింహ‌ద్వారానికి ఎదురుగా దిష్టి గుమ్మ‌డికాయ‌ను క‌డ‌తారు. న‌ర‌దిష్టి, దుష్ట శ‌క్తుల ప్ర‌భావం మ‌న ఇంటికి త‌గ‌ల‌కుండా ఉండ‌డానికి ఇంటి ముందు దిష్టి గుమ్మ‌డికాయ క‌ట్టాల‌ని తంత్ర శాస్త్రం చెబుతోంది.

here it is how to use Disti Boodida Gummadikaya
Disti Boodida Gummadikaya

దుష్ట శ‌క్తుల‌ను త‌న‌లో దాచుకోగ‌లిగిన శ‌క్తి గుమ్మ‌డికాయ‌కు ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. అందుకే గృహ ప్ర‌వేశ స‌మ‌యంలో గుమ్మం ముందు కాశీ గుమ్మ‌డికాయ‌ను ప‌గ‌ల‌కొట్టి బూడిద గుమ్మడికాయ‌ను సింహ‌ద్వారానికి ఎదురుగా వేలాడ దీస్తారు. గుమ్మ‌డికాయ‌ను ఇంటి ముందు ఎలా క‌ట్టాలి.. అది పాడైతే ఏవిధంగా భావించాలి.. గుమ్మ‌డికాయ‌ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మార్చాలి వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

నాణ్య‌మైన బూడిద గుమ్మ‌డికాయ‌ను తీసుకుని దానికి శాస్త్రం ప్ర‌కారం కూష్మాండ పూజ చేయించి ఇంటి ప్ర‌ధాన ద్వారం ఎదురుగా ఉట్టిలో వేలాడ‌దీయాలి. రోజూ మ‌న ఇంట్లో పూజ చేసిన ధూపాన్ని గుమ్మ‌డికాయ‌కు కూడా చూపించాలి. అప్పుడే దానిలోని శ‌క్తి మ‌రింత పెరుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. మ‌న ఇంటికి క‌ట్టిన గుమ్మ‌డికాయ పాడైనా, త్వ‌ర‌గా ఎండిపోయినా మ‌న ఇంటికి దిష్టి ఎక్కువ‌గా తాకింద‌ని భావించాలి.

ఇలా పాడైన గుమ్మ‌డికాయ‌ను అశ్ర‌ద్ధ చేయ‌కుండా వెంట‌నే తొల‌గించి వేరే గుమ్మ‌డికాయ‌ను క‌ట్టుకోవాలి. పాడైన గుమ్మ‌డికాయ‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ప‌డేయ‌కుండా ప్ర‌వ‌హించే నీటిలో వేయాలి. అలాగే దిష్టి గుమ్మ‌డికాయ‌కు ఇంట్లో మైల గాలి త‌గిలినా, గ్ర‌హ‌ణం వ‌చ్చినా, ఇంట్లో అమ్మాయి పుష్ప‌వ‌తి అయినా అది దాని శ‌క్తిని కోల్పోతుంది. ఇలాంటి స‌మ‌యాల్లో కూడా గుమ్మ‌డికాయ‌ను మార్చుకోవాలి. దిష్టి గుమ్మ‌డికాయ‌ను సొంత ఇంటి వారే క‌ట్టుకోవాల‌ని నియ‌మ‌మం ఏమీ లేదు. అద్దెకు ఉంటున్న ఇంటివారైనా కూడా గుమ్మానికి దిష్టి గుమ్మ‌డికాయ‌ను క‌ట్టుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు.

D

Recent Posts