Jonna Rotte : చపాతీ, రోటీ, నాన్.. తినడం మనకు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్టలేసుకుంటూ తినేవారి సంఖ్య పెరిగింది. నిజానికి ఒకప్పుడు జొన్నలకు పేదల ఆహారంగా పేరు. ఇప్పుడు మన వంటిళ్లలోనే కాదు, వీధుల్లోనూ జొన్న రొట్టెల తయారీ ఊపందుకుంది. అన్ని వర్గాలకు చేరువైన ఈ చిరు ధాన్యంలో పోషకాలు పుష్కలం. రుచి అమోఘం. అందుకే మధుమేహులు మొదలుకొని బరువు తగ్గాలనుకునే వారి వరకు అంతా వీటినే తింటున్నారు. అయితే దీన్ని తయారు చేయడం అంత సులభమేమీ కాదు. కొన్ని కిటుకులు తెలుసుకోవాలి. అవేంటో, ఇందులో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నల్లో ఉండే పోషకాలు..
జొన్నల్లో బి కాంప్లెక్స్ విటమిన్లకు తోడు ఫైబర్, విటమిన్ ఎ, విటమిస్ సి, క్రూడ్ ఫ్యాట్, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ రహిత ఆహారం కావడంతో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. ఈ జొన్న రొట్టెల్లోని కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌ని నెమ్మదిగా విడుదల చేయడం వల్ల జొన్న రొట్టెను మధుమేహులూ తినవచ్చు. ప్రోటీన్ అవసరం ఎక్కువ ఉన్న శాకాహారులు దీన్ని రోజూ తీసుకోవచ్చు. జొన్న పిండిలోని ఫైబర్ అరుగుదలను పెంచడమే కాదు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది.
జొన్న రొట్టెలు నూనె లేకుండా మంట మీద కాల్చడం వల్ల ఇందులోని ఇనుము తగినంతగా శరీరానికి అందుతుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే ఇందులోని పొటాషియం, మెగ్నిషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు.
జొన్న రొట్టెలు చేసేందుకు చిట్కాలు..
చపాతీ, రోటీ చేసిన కొద్ది గంటల్లోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోతాయి. కానీ జొన్న రొట్టె అలా కాదు. ముఖ్యంగా కడక్ రోటీ వారాలు, నెలల తరబడి భద్రపరుచుకోవచ్చు. మరో రకం మెత్తని రోటీని వేడి వేడిగా ఉన్నప్పుడు తినడమే మేలు. జొన్న పిండిని కలపడానికి వేడి నీళ్లను ఉపయోగించండి. నీళ్లు మరిగేటప్పుడే కాస్త నూనె, రుచికి సరిపడా ఉప్పు కలపండి. జొన్న పిండిని కలిపేటప్పుడే ఓ చెంచా గోధుమ పిండిని చేర్చితే రొట్టెకు పగుళ్లు రావు. దీన్ని తడిపిన వెంటనే చేసేయొద్దు. ఓ 10 నిమిషాలైనా తడి వస్త్రాన్ని కప్పి పక్కన పెడితే సరి. అలాగే వీటిని చపాతీ కర్రతో ఒత్తకూడదు. చేత్తో అద్దుతూ చేస్తేనే చక్కగా వస్తాయి. రొట్టెలు మృదువుగా, విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా జొన్న రొట్టెలను తయారు చేయవచ్చు. దీన్ని తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.