India Vs Sri Lanka : తొలి టెస్టులో శ్రీ‌లంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం..!

India Vs Sri Lanka : మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ ధాటికి శ్రీలంక విలవిలలాడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన స్కోరును సమం చేసే క్రమంలో శ్రీలంక ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీలంకపై భారత్ ఒక ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

India Vs Sri Lanka India won by an innings and 222 runs against Sri Lanka
India Vs Sri Lanka

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ క్ర‌మంలోనే భారత్ త‌న తొలి ఇన్నింగ్స్‌ను 574/8 వద్ద డిక్లేర్ చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో ర‌వీంద్ర జ‌డేజా, రిష‌బ్ పంత్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు అద్భుతంగా రాణించారు. 228 బంతులు ఆడిన జ‌డేజా 17 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 175 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 97 బంతుల్లో పంత్ 9 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 96 ప‌రుగులు చేశాడు. అలాగే అశ్విన్ 82 బంతుల్లో 8 ఫోర్ల‌తో 61 ప‌రుగులు చేశాడు. శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో సురంగ ల‌క్‌మ‌ల్‌, విశ్వ ఫెర్నాండో, ల‌సిత్ ఎంబుల్‌దెనియాలు త‌లా 2 వికెట్లు తీశారు. లాహిరు కుమార‌, ధ‌నంజ‌య డిసిల్వ చెరొక వికెట్ తీశారు.

అనంత‌రం త‌న తొలి ఇన్నింగ్స్ ను ఆడిన లంక 174 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ప‌తుమ్ నిస్సంక (61 ప‌రుగులు) మిన‌హా ఎవ‌రూ రాణించ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా 5 వికెట్లు తీసి ఆల్ రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. బుమ్రా, అశ్విన్‌ల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. ష‌మీ 1 వికెట్ తీశాడు. ఈ క్ర‌మంలో ఫాలో ఆన్ ఆడిన లంక మ‌ళ్లీ 178 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ గెలుపొందింది. లంక బ్యాట్స్‌మెన్‌ల‌లో రెండో ఇన్నింగ్స్‌లో నిరోష‌న్ డిక్‌వెల్లా (51 నాటౌట్‌) మిన‌హా ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా మ‌ళ్లీ 4 వికెట్లు తీయ‌గా.. అశ్విన్ 4, ష‌మీ 2 వికెట్లు తీశారు. ఈ క్ర‌మంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈ నెల 12వ తేదీన బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నుంది. దీన్ని డే నైట్ రూపంలో నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Editor

Recent Posts