Pawan Kalyan Mahesh Babu : తమ అభిమాన హీరోకు చెందిన ఫ్యాన్స్ తమ హీరో గురించి ఎప్పుడూ గొప్పగానే చెబుతుంటారు. ఇక ఆ హీరో ఏవైనా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తే.. ఫ్యాన్స్ ఉప్పొంగిపోతారు. తమ రీల్ హీరో.. రియల్ లైఫ్ హీరో కూడా అయ్యారు.. అంటూ ఆనందం వ్యక్తం చేస్తారు. ఇలా పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడప్పుడు తమ సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాన్స్ మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతుంటాయి. తాజాగా మరోమారు వీరు సోషల్ మీడియా వేదికగా గొడవలకు దిగుతున్నారు.
మహేష్ బాబు తాజాగా రెయిన్‌బో హాస్పిటల్ నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ హాస్పిటల్ 125 మంది పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి మహేష్ బాబు కూడా మద్దతు పలికారు. అందులో భాగంగానే ఆ హాస్పిటల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాజాగా మహేష్ బాబు పాల్గొన్నారు. అయితే దీనిపై పవన్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు.
మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. సర్కారు వారి పాట. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసమే మహేష్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.
గతంలో పవన్ ఏపీలో మత్స్యకారుల సమస్యలపై పోరాటం చేసేందుకు అక్కడ ఓ సభ నిర్వహించారు. అయితే ఆయన భీమ్లా నాయక్ సినిమా విడుదల ఉంది కనుక.. ఆ సినిమా ప్రమోషన్ కోసమే ఆయన అలా చేశారని.. మహేష్ ఫ్యాన్స్ మండిపడ్డారు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌కు అవకాశం దొరికింది. మహేష్ చారిటీ కార్యక్రమంలో పాల్గొనగానే ఆయనను విమర్శిస్తూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న సర్కారు వారి పాట కోసమే మహేష్ ఇలా సామాజిక సేవ అంటూ హడావిడి చేస్తున్నారని.. పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే వీరి గొడవ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. నిజానికి పవన్, మహేష్ ఒకరికొకరు శత్రువులు కారు. కానీ ఫ్యాన్స్ ఇలా ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఇకనైనా ఇలా గొడవపడడం ఆపాలని.. ఏ హీరో కూడా తమ సినిమాల ప్రమోషన్ కోసం ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు చేయరని.. ఫ్యాన్స్ ఇకనైనా గొడవ పడకుండా కలసి మెలసి ఉండాలని.. కొందరు హితవు చెబుతున్నారు.