Instant Rava Sweet : బొంబాయి రవ్వను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో ఎక్కువగా ఉప్మాను తయారు చేస్తూ ఉంటాం. అలాగే రకరకాల తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. చాలా తక్కువ పదార్థాలతో, చాలా తక్కువ సమయంలో రవ్వతో మనం రుచికరమైన తీపి వంటకాన్ని తయారు చేయవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ ను తయారు చేసి పెట్టవచ్చు. రుచిగా, ఇన్ స్టాంట్ గా రవ్వతో స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ రవ్వ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, పంచదార – అర కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ – కొద్దిగా.
ఇన్ స్టాంట్ రవ్వ స్వీట్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వను వేసి కలుపుతూ వేయించాలి. రవ్వ వేగిన తరువాత అందులో పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ రవ్వను దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత అందులో పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. పంచదార కరిగి రవ్వ మివ్రమం దగ్గర పడే ఉడికించాలి. రవ్వ కళాయికి అంటుకోకుండా వేరవుతున్నప్పుడు దీనిలో మరో స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి రెండు భాగాలుగా చేయాలి. ఒక భాగంలో ఫుడ్ కలర్ వేసి కలపాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకుని ఫుడ్ కలర్ వేసిన రవ్వ మిశ్రమం నుండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత మిగిలిన రవ్వ మిశ్రమం నుండి కొద్దిగా తీసుకుని ఉండగా చేయాలి.
తరువాత ఈ ఉండను చెక్క అప్పలా వత్తాలి. ఇప్పుడు దీని మధ్యలో ఎల్లో రవ్వ ఉండను ఉంచి అంచులను మూసేసి గుండ్రంగా వత్తుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ రవ్వ స్వీట్ తయారవుతుంది. ఎల్లో ఫుడ్ కలర్ కు బదులుగా ఈ స్వీట్ తయారీలో కుంకుమ పువ్వును కూడా ఉపయోగించవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రవ్వతో ఈ ఇన్ స్టాంట్ స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు. తీపిని ఇష్టపడే వారికి ఈ ఇన్ స్టాంట్ రవ్వ స్వీట్ చాలా బాగా నచ్చుతుంది.