Instant Sambar Podi : సాంబార్.. సాంబార్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని మనం తీసుకుంటూ ఉంటాము. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. చాలామంది దీనిని లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే సాంబార్ ను తయారు చేయడం కొద్దిగా సమయంతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఉదయాన్నే అల్పాహారంలోకి దీనిని తయారు చేయడం అందరికి కుదరదనే చెప్పవచ్చు. సమయం వృద్దా కాకుండా సాంబార్ పొడిని తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం 10 నిమిషాల్లోనే రుచికరమైన సాంబార్ ను తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లోనే సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ సాంబార్ పొడితో సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాంబార్ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు -ఒక కప్పు, పెసరపప్పు – అర కప్పు, ధనియాలు – 2 టీ స్పూన్స్, లవంగాలు – 3, యాలకులు – 2, మిరియాలు – 10 నుండి 12, మెంతులు – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 15, కరివేపాకు – రెండు రెమ్మలు, చింతపండు – పిడికెడు, ఉప్పు – తగినంత.
సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ముక్కలుగా తరిగిన టమాట -1, తరిగని మునక్కాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన క్యారెట్ – 1, తరిగిన క్యాప్సికం – 1, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన బంగాళాదుంప – 1, నూనె – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – 3 గ్లాసులు, సాంబార్ పొడి – 3 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సాంబార్ పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో కందిపప్పు వేసి వేయించాలి. ఇది కొద్దిగా వేగిన తరువాత పెసరపప్పు వేసి పూర్తిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ధనియాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి వేయించాలి. వీటిని ప్లేట్ లోకి తీసుకుని తరువాత మెంతులు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఆవాలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. చివరగా ఎండుమిర్చి,కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు కరకరలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత జార్ లో వేసుకోవాలి. తరువాత చింతపండు, ఉప్పు వేసి మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
ఈ పొడి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సాంబార్ పొడి తయారవుతుంది. ఇప్పుడు ఈ పొడితో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీని కోసం గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కూరగాయల ముక్కలు వేసి పెద్ద మంటపై 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, ఇంగువ, పసుపు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి.ఈ సాంబార్ ను 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న సాంబార్ పొడిని 2 లేదా 3 టీ స్పూన్ల మోతాదులో వేసి కలపాలి.
తరువాత కూరగాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సాంబార్ తయారవుతుంది. ఈ సాంబార్ ను ఇలాగే తినవచ్చు లేదా తాళింపు కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన సాంబార్ ను ఇడ్లీ, దోశ, వడ వంటి అల్పాహారాలతో తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే సాంబార్ ను పొడిని తయారు చేసుకోవడం వల్ల నిమిషాల్లోనే రుచికరమైన సాంబార్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.