Jonna Dosa Without Rice : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనందరికి తెలుసు. జొన్నలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ జొన్నలతో రోటి, సంగటి, గటక వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా జొన్న పిండితో మనం దోశలను కూడావేసుకోవచ్చు. జొన్న దోశలను తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ జొన్న దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక టీ గ్లాస్, జొన్న పిండి – 2 టీ గ్లాసులు, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
జొన్న దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పును ఒక జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సగం పిండిని వేసి మిగతా సగం పిండిని జార్ లోనే ఉంచాలి. తరువాత ఈ జార్ లో జొన్నపిండిని వేసి మరలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిలో ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడచకచార తగినంత పిండిని తీసుకుని దోశలా వేసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన తరువాత దీనిపై నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. ఈ దోశను రెంఉడ వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే జొన్న దోశ తయారవుతుంది. ఈ దోశ పిండి పులవాల్సిన అవసరం లేదు.దోశ పిండిని తయారు చేసి ఫ్రిజ్ లో ఉంచి మరుసటి రోజూ దోశలను వేసుకోవచ్చు. అలాగే ఈ దోశ మీద ఉల్లికారం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వంటి వాటిని కూడా వేసుకోవచ్చు. ఈ దోశలను ఏ విధమైన చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. జొన్న పిండితో ఈ విధంగా దోశలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్నికూడా పొందాలనుకునే వారు ఈ విధంగా జొన్న పిండితో దోశలను తయారు చేసుకుని తినవచ్చు.