Kandi Kattu : పాత‌కాలం నాటి వంట‌.. కంది క‌ట్టు.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Kandi Kattu : మ‌నం కందిప‌ప్పుతో ప్పు, సాంబార్, పప్పుచారు ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కందిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్స్ తో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇవే కాకుండా కందిప‌ప్పుతో మ‌నం కంది క‌ట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని అమ్మ‌మ్మ‌ల కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. ఈ కందిక‌ట్టును వేసవికాలంలో త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల పొట్ట‌కు హాయిగా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, పుల్ల పుల్ల‌గా ఉండే ఈ కంది క‌ట్టును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కందిక‌ట్టు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక గ్లాస్, నీళ్లు – 4 నుండి 5 గ్లాసులు, నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – అర టీ స్పూన్, మెంతులు – 10 గింజ‌లు, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Kandi Kattu recipe in telugu make in this method
Kandi Kattu

కందిక‌ట్టు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత 4 నుండి 5 గ్లాసుల నీళ్లు, కొద్దిగా ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌రకు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ప‌ప్పుపై ఉండే నీటిని మాత్ర‌మే ఒక గిన్నెలోకి తీసుకుని ప‌ప్పును ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ప‌ప్పును ఉడికించిన నీటిలో నిమ్మ‌ర‌సం, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌ల‌పాలి. తాళింపు వేగిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న ప‌ప్పు నీటిని పోసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కందిక‌ట్టు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా కంది క‌ట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కందిక‌ట్టు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది క‌నుక దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts