Karam Shanagapappu : మనకు బయట దుకాణాల్లో, స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో కారం శనగపప్పు కూడా ఒకటి. శనగపప్పుతో చేసే ఈ చిరుతిండి చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా క్రిస్పీగా ఉంటుంది. స్నాక్స్ గా వీటిని చాలా మంది తింటూ ఉంటారు. అయితే బయట కొనే పని లేకుండా ఈ కారం శనగపప్పును మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. కింద చెప్పిన విధంగా చేయడం వల్ల అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ కారం శనగపప్పును ఇంట్లో కూడా అదే రుచితో అంతే క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కారం శనగపప్పును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కారం శనగపప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, నూనె – డీప్ ప్రైకు సరిపడా, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్.
కారం శనగపప్పు తయారీ విధానం..
ముందుగా పప్పును 3 నుండి 4 సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత పప్పును నీరంతా పోయేలా పూర్తిగా వడకట్టాలి. ఇప్పుడు ఈ పప్పును వస్త్రంపై వేసి ఫ్యాన్ గాలికి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఆరబెట్టిన పప్పును ఒక చిన్నరంధ్రాలు ఉండే జల్లిగిన్నెలోకి తీసుకుని ఈ జల్లిగిన్నెను నూనెలో ఉంచి పప్పును వేయించాలి. ఈ పప్పును స్పూన్ తో కదుపుతూ మధ్యస్థమంటపై ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా పప్పునంతా వేయించుకున్న తరువాత పేపర్ ను తీసేసి ఇందులో ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలపాలి. పప్పు చల్లారిన తరువాత దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కారం శనగపప్పు నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం శనగపప్పును ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.