Karthika Masam 2022 : హిందూ సంప్రదాయం ప్రకారం 12 నెలల్లో కార్తీక మాసం కూడా ఒకటి. ఈ మాసం సాధారణంగా అక్టోబర్ – నవంబర్ నెలల్లో వస్తుంటుంది. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. అందుకనే శైవ క్షేత్రాలు ఈ మాసంలో సందడిగా ఉంటాయి. భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే కార్తీక మాసంలో కేవలం శివున్ని మాత్రమే కాదు.. విష్ణువును కూడా పూజిస్తారు. ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను చేస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో శుభకరమైనదిగా చెబుతుంటారు.
కార్తీక మాసంలో ప్రతి సోమవారం శుభదాయకమైనది. అయితే కొన్ని రోజుల్లోనూ మంచి ముహుర్తాలు ఉంటాయి. ఈసారి కార్తీక మాసం అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ సమయంలో వివాహాది శుభ కార్యాలకు పలు రోజులు అనుకూలంగా ఉన్నాయి. అవేమిటంటే.. నవంబర్ 19, 20, 21, 22 రోజుల్లో వివాహాలకు అనుకూలమైన ముహుర్తాలు ఉన్నాయి. అలాగే ఈ రోజుల్లో ఏ పనులను అయినా వారి వారి జాతకాల ప్రకారం ప్రారంభించవచ్చు.
ఇక ఈ మాసంలో చాలా మంది భక్తి శ్రద్ధలతో అనేక పూజలు చేస్తుంటారు. కార్తీక మాసంలో నాలుగు సోమవారాల్లో శివుడికి వరుసగా రుద్రాభిషేకం చేస్తే అనుకున్నవి నెరవేరుతాయని.. మరుజన్మ ఉండదని.. మరణించాక నేరుగా కైలాసానికి చేరుకుంటారని చెబుతారు. అలాగే చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతాలను కూడా చేస్తుంటారు. దీంతోపాటు వనభోజనాలకు కూడా వెళ్తుంటారు. ఇలా కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుంది.