Left Over Rice Chapati : ఎంతో కాలంగా మనందరికి అన్నం ప్రధాన ఆహారంగా ఉంటూ వస్తుంది. అన్నాన్ని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే ఒక్కోసారి మన ఇంట్లో అన్నం ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు మనం ఆ అన్నంతో లెమన్ రైస్, ఎగ్ రైస్ వంటి రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. తరచూ చేసే రైస్ వెరైటీలతో పాటు మిగిలిన అన్నంతో మనం చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో చేసే ఈ చపాతీలు చాలా చక్కగా ఉంటాయి. వీటిని సాధారణ చపాతీల వలె సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా మిగిలిన అన్నంతో చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒక కప్పు, గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు -తగినంత, నూనె – 3 టీ స్పూన్స్.
చపాతీ తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని ఒక జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత గోధుమపిండి, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.పెనం వేడయ్యాక చపాతీ వేసి కాల్చుకోవాలి. దీనిని నూనె వేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకితీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అన్నం చపాతీలు తయారవుతాయి. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. బ్రౌన్ రైస్ తో కూడా ఈ చపాతీలను తయారు చేసుకోవచ్చు. ఏ కూరతో తిన్నా కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ విధంగా అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు చక్కగా చపాతీలను తయారు చేసుకుని తినవచ్చు.