Lizards In Home : మన ఇంట్లో ఉండే కీటకాల్లో బల్లులు కూడా ఒకటి. ఇవి గోడల మీద పాకుతూ చూడడానికే భయంకరంగా అసహ్యంగా ఉంటాయి. కొందరైతే వీటిని చూస్తేనే భయపడిపోతూ ఉంటారు. ఇంట్లో బల్లులతో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.మనం వంట చేసుకునే పాత్రలపై పాకుతూ ఇవి వివిధ అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి. ఇంట్లో నుండి బల్లులను పారద్రోలడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో బల్లులను పారద్రోలే వివిధ రకాల స్ప్రేలు అందుబాటులో ఉన్నప్పటికి అవి రసాయనాలతో తయారు చేసినవై ఉంటాయి. కనుక వీటిని వాడడం వల్ల మనం కూడా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా ఇంట్లో నుండి బల్లులను బయటకు పంపించవచ్చు. ఈ చిట్కాలు సహజ సిద్దమైనవి కనుక వీటిని వాడడం వల్ల ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు. ఈ చిట్కాలను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక జార్ లో 5 వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయను కట్ చేసి తీసుకోవాలి. ఇందులోనే దంచిన 5 మిరియాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని బల్లులపై అలాగే బల్లులు ఎక్కువగా తిరిగే చోట స్ప్రే చేయాలి.
ఇలా చేయడం వల్ల బల్లులు ఇంట్లో నుండి పారిపోతాయి. బల్లులను పారద్రోలే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. తరువాత ఈ నీటిలో ముద్ద కర్పూరాన్ని పొడిగా చేసి వేయాలి. తరువాత కర్పూరం నీటిలో కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని స్ప్రే బాటిల్ లో పోసుకుని బల్లులపై స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా బల్లుల బెడద నుండి బయటపడవచ్చు. అలాగే ఒక గిన్నెలో అర చెక్క నిమ్మరసాన్ని తీసుకోవాలి. తరువాత అర టీ స్పూన్ డెటాల్ ను, అర టీ స్పూన్ లైజాల్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బల్లులపై స్ప్రే చేయాలి.
ఇలా చేయడం వల్ల కూడా బల్లులు పారిపోతాయి. వీటితో పాటు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు బూజు లేకుండా చూసుకోవాలి. గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. ఇంటికి తరచూ పెయింట్ లేదా సున్నాన్ని వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా బల్లుల బెడద నుండి బయటపడవచ్చు.