Alu 65 : పెళ్లి భోజ‌నాల‌లో వ‌డ్డించేలా.. ఆలూ 65ని ఇలా ఇంట్లోనే త‌యారు చేయ‌వచ్చు..

Alu 65 : బంగాళాదుంప‌.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. దుంప జాతికి చెందిన‌ప్ప‌టికీ వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బంగాళాదుంపతో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ 65 కూడా ఒక‌టి. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ 65 ని క్యాట‌రింగ్ స్టైల్‌లో ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ 65 త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప‌లు – 4 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నీళ్లు – అర లీట‌ర్, ఉప్పు – త‌గినంత‌, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – అర టేబుల్ స్పూన్, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నూనె – డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – చిటికెడు, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌స‌లా పొడి – అర టీ స్పూన్, చిలికిన పెరుగు – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

make Alu 65 just like served in dinners
Alu 65

ఆలూ 65 త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌ల‌ను, ఉప్పును వేసి మెత్త‌గా ఉడికించాలి. ఈ బంగాళాదుంప ముక్క‌లను మ‌రీ మెత్త‌గా కాకుండా చిదురు అవ్వ‌కుండా ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత ఈ ముక్క‌ల‌ను నీటి నుండి వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, ఫుడ్ క‌ల‌ర్, కొద్దిగా ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిలో ముందుగా ఉడికించిన బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి పిండి అంతా ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌లుపుకోవాలి.

త‌రువాత క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత ఈ బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఎండు మిర్చి, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత ఇందులో కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా పొడి, ప‌సుపు క‌లిపి ఒక నిమిషం పాటు వేడి చేయాలి.

త‌రువాత ఇందులో పెరుగు వేసి క‌లుపుతూ పెరుగులోని నీరు అంతా పోయే వ‌ర‌కు వేడి చేయాలి. పెరుగులోని నీరు పోయి పెరుగు ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత అందులో ముందుగా వేయించిన బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి క‌లుపుకోవాలి. ఈ ముక్క‌ల‌ను మ‌రో 2 నిమిషాల పాటు వేయించి వాటి పైన కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ65 త‌యార‌వుతుంది. దీనిని ప‌ప్పు, సాంబార్, ర‌సం వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల రుచిగా క్యాట‌రింగ్ స్టైల్ లో ఉండే ఆలూ65 త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts