Masala Palli : మనకు స్వీట్ షాపుల్లో, బేకరీల్లో లభించే వాటిల్లో మసాలా పల్లి కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ మసాలా పల్లీలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది. రుచిగా మసాలా పల్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పల్లి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, శనగపిండి – పావు కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మసాలా పల్లి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఆమ్ చూర్ వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత ఇందులో కరివేపాకు, పుదీనా వేసి మరోసారి కలపాలి. తరువాత పల్లీలను కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక మంటను చిన్నగా చేసి పల్లీలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి.
నూనెకు సరిపడా పల్లీలు వేసిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి పల్లీలను కరకరలాడే వరకు వేయించుకోవాలి. తరువాత పల్లీలను తీసి టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లి తయారవుతుంది. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఇలా మసాలా పల్లీలను తయారు చేసుకుని తినవచ్చు.