Badusha : మనం అనేక రకాల తీపి పదార్థాలను తింటూ ఉంటాం. వీటిలో బాదుషా కూడా ఒకటి. దీని రుచి మనందరికీ తెలుసు. ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీటిని మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా ఎంతో రుచిగా ఉండే బాదుషాలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదుషా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, వంటసోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, వెన్న లేదా నెయ్యి – పావు కప్పు, పెరుగు – పావు కప్పు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, యాలకుల పొడి – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
బాదుషా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఒక టీ స్పూన్ పంచదార, వంటసోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు, వెన్న లేదా నెయ్యి, పెరుగును వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. 15నిమిషాల తరువాత పిండిని సాగదీస్తూ ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని గుండ్రని ముద్దగా చేసి బాదుషా ఆకారంలో వత్తి మధ్యలో ఒక రంధ్రాన్ని చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి కాగిన తరువాత ముందుగా తయారు చేసి బాదుషాలను వేసి రెండు దిక్కులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో పంచదారను వేసి నీళ్లను పోసి పంచదార కరిగి తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార తీగ పాకం వచ్చిన తరువాత యాలకుల పొడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో ముందుగా ఎర్రగా కాల్చి పెట్టుకున్న బాదుషాలను వేసి పది నిమిషాల పాటు నానబెట్టి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఒక వేళ బాదుషాలు జ్యూసీ గా ఉండాలనుకుంటే పంచదార తీగ పాకం వచ్చిన తరువాత దాంట్లో ఒక అర ముక్క నిమ్మకాయను పిండి కలిపిన తరువాత బాదుషాలను వేసి నానబెట్టుకోవాలి. ఇలా నిమ్మకాయను పిండడం వల్ల పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఈ విధంగా మన రుచికి తగినట్టుగా చాలా సులువుగా బయట దొరికే విధంగా బాదుషాలను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.