Challa Punugulu : మనం సాయంత్రం సమయాలలో రకరకాల చిరు తిళ్లను తింటూ ఉంటాం. ఇలా తినే వాటిలో చల్ల పునుగులు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయని మనందరికీ తెలుసు. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి ఎక్కువగా హోటల్స్ లో, రోడ్డు పక్కన బండ్ల మీద లభిస్తూ ఉంటాయి. వీటిని మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. చల్ల పునుగులను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చల్ల పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, పెరుగు – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
వేయించిన పచ్చి మిర్చి – 5 లేదా రుచికి తగినన్ని, పుట్నాల పప్పు – అర కప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – 4 ( చిన్నవి), ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
చల్ల పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా పిండిని కలిపి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన ఉంచాలి. ఒక గంట తరువాత పిండిని మరో సారి కలిపి కళాయిలో నూనె పోసి కాగిన తరువాత పిండిని తక్కువ పరిమాణంలో తీసుకుని నూనెలో పునుగులుగా వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని టిష్యూ పేపర్ ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చల్ల పునుగులు తయారవుతాయి.
చట్నీ తయారీ విధానం..
ఒక జార్ లో నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లను పోసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చట్నీ తయారవుతుంది. దీనిని తాళింపు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చల్ల పునుగులను, చట్నీ ని తయారు చేసుకుని ఉల్లిపాయలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా తినడానికి ఈ చల్ల పునుగులు చక్కగా ఉంటాయి.