Tomato Pickle : మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటితో కూరలనే కాకుండా నిల్వ పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే నిల్వ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో మనందరికి తెలిసిందే. ఈ టమాట నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – అరకిలో, చింతపండు – 50 గ్రా., ఉప్పు – 50 గ్రా., కారం – 50 గ్రా., పసుపు – ఒక టీ స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, మెంతిపిండి – ఒక టీ స్పూన్, ఆవ పిండి – 2 టీ స్పూన్స్.
తాళింపు తయారీకి కావల్సిప పదార్థాలు..
నూనె – 200 గ్రా., శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 4, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – పావు టీ స్పూన్.
టమాట నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని గాలికి ఆరబెట్టి పూర్తిగా తడిలేకుండా చేసుకోవాలి. తరువాత టమాట ముక్కలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో టమాట ముక్కలను, చింతపండును వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత మూత తీసి నీరు అంతా పోయే వరకు కలుపుతూ ఉడికించాలి. తరువాత ఈ ముక్కలు పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలపాలి. ఈ పచ్చడిని చిన్న మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత జాడీలోకి గానీ, మూత ఉండే గాజు సీసాలో కానీ ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేయడం వల్ల టమాట పచ్చడి నాలుగు నెలల వరకు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్ల ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల కమ్మటి రుచిని కలిగి ఉండే టమాట పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంలో టమాట పచ్చడి, నెయ్యిని వేసి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.