Mamidikaya Roti Pachadi : వేసవి కాలం రాగానే చాలా మంది పచ్చి మామిడి కాయలతో సంవత్సరానికి సరిపడేలా పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మామిడి కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, వడదెబ్బ బారిన పడకుండా చేయడంలో పచ్చి మామిడి కాయ ఉపయోగపడుతుంది. పచ్చి మామిడికాయలతో నిల్వ పచ్చడినే కాకుండా రోటి పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చి మామిడి కాయతో చేసే రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు తయారు చేసే ఈ రోటి చ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి కాయ రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చెక్కు తీసి ముక్కలుగా చేసిన మామిడి కాయ – 1 (పెద్దది), వేయించి పొట్టు తీసిన పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు మిరపకాయలు – 7 లేదా 8, తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగ పప్పు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మామిడి కాయ రోటి పచ్చడి తయారు చేసే విధానం..
ముందుగా ఎండు మిరపకాయలను కళాయిలో వేసి రంగు మారే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నువ్వులను వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోటిలో మామిడి కాయ ముక్కలను, పల్లీలను, వేయించిన నువ్వులను, ఎండు మిరపకాయలను, రుచికి తగినంత ఉప్పును వేసి కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేలా దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వాటిని కొద్దిగా కచ్చా పచ్చాగా దంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత మిగిలిన పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా నూరి పెట్టుకున్న పచ్చడిని వేసి కొద్దిగా నీళ్లను పోసి కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడి కాయ రోటి పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని మిక్సీ జార్ లో వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యిని వేసి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా పచ్చి మామిడి కాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.