Meal Maker Masala Curry Recipe : మనం ఆహారంగా తీసుకునే సోయా ఉత్పత్తుల్లో మీల్ మేకర్ కూడా ఒకటి. వీటిని చాలా మంది ఆహారంగా తీసుకుంటారు. వీటిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉంటాయి. మీల్ మేకర్ లతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మీల్ మేకర్ లతో ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – 100 గ్రా., జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన టమాట – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెబ్బ, కసూరి మెంతి – అర టీ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, సాజీరా – ఒక టీ స్పూన్, యాలకులు – 3, లవంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, జాపత్రి – 1, బిర్యానీ ఆకు – 1.
మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలను వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత అందులో అర గ్లాస్ నీటిని పోసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత మీల్ మేకర్ లలో గోరు వెచ్చని నీటిని పోసి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత ఈ మీల్ మేకర్ లలోని నీటిని పిండుతూ ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిపప్పును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో మీల్ మేకర్ లను వేసి వేయించుకోవాలి. వీటిని రంగు మారేంత వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఇందులో ముందుగా వేయించిన మీల్ మేకర్ ను, ఒక గ్లాస్ నీటిని పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర, కసూరి మెంతి, వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, బటర్ నాన్, రోటి, పుల్కా, పులావ్, బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని అందరూ ఇష్టంగా తింటారు.