Moong Dal Pakoda : పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే ప‌కోడీల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Moong Dal Pakoda : పెస‌ర‌ప‌ప్పును మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాలు ల‌భించ‌డంతో పాటు శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో పెస‌ర‌ప‌ప్పు ప‌కోడీలు కూడా ఒక‌టి. ఇవి చాలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. పెస‌ర‌ప‌ప్పుతో ఈ ప‌కోడీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే ఈ పెస‌ర‌ప‌ప్పు ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెస‌ర‌ప‌ప్పు ప‌కోడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెస‌ర‌ప‌ప్పు – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, స‌న్న‌గా త‌రిగిన కొత్తిమీర – పావు క‌ప్పు, అల్లం తరుగు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Moong Dal Pakoda recipe in telugu make in this way
Moong Dal Pakoda

పెస‌ర‌ప‌ప్పు ప‌కోడి త‌యారీ విధానం..

ముందుగా పెస‌ర‌ప‌ప్పును ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 2 నుండి 3 గంట‌ల పాటు నానబెట్టాలి. త‌రువాత నీటిని వ‌డ‌క‌ట్టి పెస‌ర‌ప‌ప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత దీనిని బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెస‌ర‌ప‌ప్పు మిశ్ర‌మంలో నూనె తప్ప పైన తెలిపిన మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పెస‌ర‌ప‌ప్పు మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ప‌కోడీల ఆకారంలో నూనెలో వేసుకోవాలి. ఇలా త‌గిన‌న్ని ప‌కోడీల‌ను వేసుకున్న త‌రువాత మ‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకోవాలి. ఈ ప‌కోడీల‌ను అటూ ఇటూ తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ లోకి వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పెస‌ర‌ప‌ప్పు ప‌కోడీలు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీ, కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఈ ప‌కోడీలు చాలా చ‌క్క‌గా ఉంటాయి.

D

Recent Posts