Nimmakaya Pappu : మనం నిమ్మకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. నిమ్మరసాన్ని వంటల్లో మనం విరివిరగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నిమ్మరసాన్ని ఇతర వంటకాల్లో వాడడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే పప్పును కూడా తయారు చేసుకోవచ్చన్న సంగతి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. నిమ్మరసం వేసి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఈ పప్పును ఇష్టంగా తింటారు. నిమ్మకాయలతో రుచిగా, సులభంగా పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 100 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తాళింపు దినుసులు – 4, ఎండుమిర్చి – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నిమ్మకాయలు – 2.
నిమ్మకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. తరువాత ఈ పప్పును మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. దీనిలో ఉప్పు, పసుపు, అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పప్పులో వేసి కలపాలి. పప్పు పూర్తిగా చల్లారిన తరువాత అందులో నిమ్మరసం వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పప్పు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే పప్పు కూరలతో పాటు ఈ విధంగా నిమ్మకాయలతో కూడా పప్పును తయారు చేసుకుని తినవచ్చు. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా నిమ్మకాయ పప్పు చేసుకుని తినవచ్చు. ఈ పప్పును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.