Pachi Mirchi Pappu : టమాట పప్పును రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. టమాటాలతో ఎక్కువగా చేసే వంటకాల్లో ఇది ఒకటి. అన్నం, చపాతీ, రోటి.. ఇలా దేనితో తినడానికైనా కూడా ఈ పప్పు చక్కగా ఉంటుంది. ఈ టమాట పప్పును మరింత రుచిగా పచ్చిమిర్చి వేసి కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి తయారు చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించే ఈ పచ్చిమిర్చి టమాట పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చిమిర్చి టమాట పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన కందిపప్పు – అర కప్పు, పచ్చిమిర్చి -10 నుండి 12, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), తరిగిన టమాటాలు – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – అర లీటర్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – గుప్పెడు.
పచ్చిమిర్చి టమాట పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నానబెట్టిన కందిపప్పును తీసుకోవాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్ఈన వేసి మూత పెట్టాలి. ఈ పప్పును మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత కొత్తిమీర వేసి అర నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న పప్పులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి టమాట పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, రొట్టె, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే టమాట పప్పుతో పాటు అప్పుడప్పుడూ పచ్చిమిర్చి వేసి ఈవిధంగా కూడా పప్పును తయారు చేసుకుని తినవచ్చు. ఈ పప్పును లొట్ట లేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.