Palak Chicken : మనం చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ చికెన్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్, ధాబాలలో లభిస్తుంది. రోటీ, నాన్ వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పాలక్ చికెన్ ను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ పాలక్ చికెన్ ను తయారు చేసుకోవడం చాలా సులభం. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని రుచిగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ పాలక్ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – అర లీటర్, పాలకూర – ఒక పెద్ద కట్ట, నూనె – పావు కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు, పసుపు – అర టీ స్పూన్, అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అరకిలో, నీళ్లు – 400 ఎమ్ ఎల్, గరం మసాలా – ఒక టీ స్పూన్, బటర్ – పావు కప్పు.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 8, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెమ్మలు – 8, కర్బూజ గింజలు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్.
పాలక్ చికెన్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత పాలకూర వేసి 3 నిమిషాల పాటు ఉడికించి వడకట్టి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో పాలకూర వేసి పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పసుపు వేసికలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి.
దీనిని 4 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి చికెన్ దగ్గర పడే వరకు ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత గరం మసాలా, పాలకూర పేస్ట్ వేసి కలపాలి. దీనిలోని నీరంతా పోయి పాలకూర ముక్కలకు పట్టే వరకు ఉడికించిన తరువాత బటర్ వేసి కలపాలి. బటర్ పైకి తేలే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలక్ చికెన్ తయారవుతుంది. దీనిని రోటీ, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పాలక్ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.