Paneer Tikka : పాలతో చేసే పదార్థాల్లో పన్నీర్ కూడా ఒకటి. పన్నీర్ ను చాలా మంది ఇష్టపడతారు. దీనితో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. పన్నీర్ తో చేసే వాటిల్లో పన్నీర్ టిక్కా కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్లలో లభిస్తుంది. ఈ పన్నీర్ టిక్కాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రుచిగా పన్నీర్ టిక్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పన్నీర్ టిక్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
పన్నీర్ – 350 గ్రాములు, పెటల్స్ లా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు – 15, పెటల్స్ లా కట్ క్యాప్సికం ముక్కలు – 15, నిమ్మరసం – ఒక టీ స్పూన్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర కప్పు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, వేడి నూనె – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్.
పన్నీర్ టిక్కా తయారీ విధానం..
ముందుగా పెరుగును తీసుకుని దానిలో ఉన్న నీరు అంతా పోయేలా ఒక వస్త్రంలో వేసి బాగా పిండి దానిపై ఏదైనా బరువును ఉంచి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండి, నూనె వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు లేకుండా చేసుకున్న పెరుగుతోపాటు మసాలా పేస్ట్ ను తయారు చేసుకోవడానికి కావల్సిన మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో పన్నీర్ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, క్యాప్సికం ముక్కలను వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత వీటిపై మూతను ఉంచి 30 నిమిషాల పాటు మారినేట్ చేసుకోవాలి.
తరువాత వుడెన్ స్టిక్స్ ను తీసుకుని వాటికి పన్నీర్ ముక్కలను అలాగే ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలను ఒక దాని తరువాత ఒకటి గుచ్చాలి. ఇప్పుడు గ్రిల్ ప్యాన్ లేదా అడుగు భాగం మందంగా ఉండే పెనాన్ని తీసుకుని వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై నూనెను రాసి ముందుగా సిద్దం చేసుకున్న వుడెన్ స్టిక్స్ ను వీలైనన్ని ఉంచాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ పైన నూనె రాస్తూ బాగా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే పన్నీర్ టిక్కా తయారవుతుంది. దీనిని మయనీస్, గ్రీన్ చట్నీ, టమాట కెచప్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఇలా పన్నీర్ టిక్కాను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యకమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.