Prawns Curry : మనం అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా రొయ్యలను కూడా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ వీటిలో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లను అధికంగా కలిగిన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. వీటితో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా చాలా సులువుగా రొయ్యల కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు- పావు కిలో, ఉప్పు – తగినంత, నిమ్మరసం – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 3, లవంగాలు – 3, యాలకులు – 2, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్, నూనె – ఒకటిన్నర టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చి మిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రొయ్యల కూర తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రొయ్యలను తీసుకుని కొద్దిగా ఉప్పును, పసుపును, నిమ్మరసాన్ని వేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. ఒక కళాయిలో దాల్చిన చెక్కను, లవంగాలను, యాలకులను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలను, జీలకర్రను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత గసగసాలను వేసి వేయించి చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. తరువాత వీటిని రోట్లో కానీ, జార్ లో కానీ వేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆవాలను, జీలకర్రను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును, పచ్చి మిర్చిని వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత టమాట ముక్కలను, పసుపును, ఉప్పును, కారాన్ని వేసి కలిపి మూతపెట్టి టమాట ముక్కలను పూర్తిగా ఉడకనివ్వాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత వాటిని గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి ఉంచిన రొయ్యలను వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై రొయ్యలలోని నీరు అంతా బయటకు పోయి రొయ్యలు దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత కొద్దిగా నీటిని పోసి ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్దను వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి.. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల కూర తయారవుతుంది. అన్నంతో కలిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.