Vellulli Karam Podi : మనం వంటల తయారీలో, పచ్చళ్ల తయారీలో ఉపయోగించే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లి రెబ్బలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయని మనందరికీ తెలుసు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఎక్కువగా మనం ఈ వెల్లుల్లి రెబ్బలను అల్లంతో కలిపి పేస్ట్ లా చేసి వంటల్లో ఉపయోగిస్తాము. పచ్చళ్లల్లో కచ్చా పచ్చాగా దంచి వేస్తూ ఉంటాం. ఈ విధంగానే కాకుండా వెల్లుల్లి రెబ్బలతో ఎంతో రుచిగా ఉండే కారం పొడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వెల్లుల్లి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న విరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, నూనె – అర టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 10 నుండి 15 లేదా రుచికి తగినన్ని, కరివేపాకు – గుప్పెడు, చింతపండు – 10 గ్రాములు, ఉప్పు – తగినంత.
వెల్లుల్లి కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను, చింతపండును, తగినంత ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల 2 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఇడ్లీ, దోశ వంటి వాటితో లేదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని వేపుడు కూరలలో కూడ వేసుకోవచ్చు. వెల్లుల్లి పాయలను ఈ విధంగా కారం పొడి లా చేసుకుని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.