Sorghum : పూర్వకాలంలో ఆహారంగా తీసుకున్న వాటిల్లో జొన్నలు ఒకటి. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఈ జొన్నలతో వండిన అన్నాన్నే తినే వారు. పూర్వకాలంలో ధనిక, బీద తేడా లేకుండా అందరూ ఈ జొన్నలనే ఆహారంగా తీసుకునే వారు. ప్రస్తుత కాలంలో వీటి వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. షుగర్ వ్యాధి బారిన పడిన తరువాత, బరువు తగ్గడానికి మాత్రమే వీటిని ఆహారంగా తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. శరీరం బలంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మనకు కావల్సిన సూక్ష్మ పోషకాలన్నీ జొన్నలలో పుష్కలంగా ఉంటాయి.
జొన్నలతో రొట్టెలనే కాకుండా జొన్న పేలాల లడ్డూలను, అంబలిని, అప్పడాలను కూడా తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల రుచితోపాటు చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. అన్ని ధాన్యాలలో కన్నా జొన్నలు ఎంతో శ్రేష్టమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇతర ధాన్యాలలో కంటే వీటిలో ఐరన్, జింక్ వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. రక్త హీనత సమస్యతో బాధపడే వారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వీటిలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండదు కనుక వీటిని ఎవరైనా తినవచ్చు. ప్రస్తుత కాలంలో జొన్నలను పండించే వారు చాలా తక్కువ. కనుక వీటి ధర మార్కెట్ లో బియ్యం కంటే ఎక్కువగా ఉంది.
జొన్నలు ఎటువంటి రుచిని, వాసనను కలిగి ఉండవు కనుక ఈ పిండిని ఎటువంటి వంటకాలలోనైనా కలుపుకోవచ్చు. 100 గ్రాముల జొన్నల్లో 72. 6 గ్రాముల పిండి పదార్థాలు, 10. 4 గ్రాముల మాంసకృత్తులు, 1.6 గ్రాముల పీచు పదార్థాలు, 4. 1 మిల్లీ గ్రాముల ఐరన్, 25 మిల్లీ గ్రాముల కాల్షియం, 20 మిల్లీ గ్రాముల ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. జబ్బు పడిన వారికి జొన్నలతో చేసిన ఆహార పదార్థాలను ఇవవ్డం వల్ల వారు త్వరగా కోలుకుంటారు.
అన్ని రకాల జొన్నలు బాలింతలకు బలవర్ధకమైన ఆహారంగా పని చేస్తాయి. వీటిని కోళ్లకు కూడా దాణాగా ఉపయోగిస్తారు. జొన్న ఆకులను, కాండాన్ని పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తారు. జొన్నల్లో ఉండే పోషక పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక జొన్నలను కూడా తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి శరీరంగా దృఢంగా తయారవుతుందని నిపుణలు చెబుతున్నారు.