Pulihora Pulusu : పులిహోర.. దీనిని రుచి చూడని వారు, దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పులహోరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మనం తరచుగా ఈ పులహోరను తయారు చేస్తూనే ఉంటాము. అయితే మనం పులిహోర పులుసును తయారు చేసి నిల్వ చేసుకోవడం వల్ల చాలా సులభంగా ఇన్ స్టాంట్ గా పులిహోరను తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా, పండగలకు ఇలా ఇన్ స్టాంట్ గా పులిహోరను తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలా పులిహోర పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనితో పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పులిహోర పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతపండు – పావుకిలో, పచ్చిమిర్చి – 10 నుండి 12, కరివేపాకు – గుప్పెడు, రాళ్ల ఉప్పు – 50 నుండి 60 గ్రా., మిరియాలు – ఒక టీ స్పూన్, పసుపు – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – అర టీ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఆవాలు – ముప్పావు టీ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక కప్పు, పల్లీలు – ముప్పావు కప్పు, శనగపప్పు – పావు కప్పు, మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్, మిరియాలు – అర టీ స్పూన్, ఆవాలు- 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 12, ఇంగువ – అర టీ స్పూన్, కరివేపాకు – గుప్పెడు.
పులిహోర పులుసు తయారీ విధానం..
ముందుగా చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత దాని నుండి చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, మిరియాలు, పసుపు, నూనె వేసి కలపాలి. తరువాత దీనిని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చింతపండు గుజ్జు ఉడికి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడి లాగా చేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత మిగిలిన తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపుచక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 2 టీ స్పూన్ల బెల్లం తురుము వేసి కలపాలి. తరువాత చింతపండు పులుసును కొద్ది కొద్దిగా వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతపండు పులుసు తయారవుతంది. దీనిని తడి లేని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 6 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసుతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం 2 కప్పుల అన్నాన్ని తీసుకోవాలి.
తరువాత ఇందులో 2 టీ స్పూన్ల నూనె, కొద్దిగా పసుపు వేసి కలపాలి. తరువాత 1/3 కప్పు పులిహోర పులుసు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పులిహోర తయారవుతుంది. ఇలా పులిహోర పులుసును తయారు చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు పులిహోరను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.