Putnala Podi : పుట్నాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. శనగలను వేయించి ఈ పుట్నాలను తయారు చేస్తారన్నసంగతి మనకు తెలిసిందే. శనగల వలె పుట్నాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి పోషకాలు అందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుట్నాలను మనం వంటల్లో వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే వీటితో చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు ఈ పుట్నాలతో మనం ఎంతో రుచిగా ఉండే కారం పొడిని తయారు చేసుకోవచ్చు. పుట్నాలతో చేసే ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. నూనె అవసరం లేకుండా 5 నిమిషాల్లో ఈ కారం పొడిని తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడిని మల్టీ పర్పస్ గా మనం ఉపయోగించుకోవచ్చు. పుట్నాల పప్పుతో రుచిగా ఉండే కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్నాల పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్నాల పప్పు – ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్.
పుట్నాల పొడి తయారీ విధానం..
ముందుగా జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత పుట్నాల పప్పు, ఉప్పు, కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుట్నాల కారం పొడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తినవచ్చు అలాగే దోశ, ఇడ్లీ వంటి అల్పాహారాలతో కలిపి తీసుకోవచ్చు. అలాగే వేపుడు కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన పుట్నాల పొడి చాలా కాలం నిల్వ ఉండడంతో పాటు చాలా రుచిగా కూడా ఉంటుంది.