Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్గా వచ్చిన చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే తొలి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. మొత్తంగా చూస్తే సినిమా బాగా లేదనే అంటున్నారు. పరమ బోరింగ్‌గా ఉందని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు వస్తున్న నెగెటివ్ టాక్ కారణంగా ప్రభాస్ అభిమాని ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా చూసి వచ్చి బాగా లేదని చెప్పి మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తిలక్ నగర్లో నివాసం ఉండే రవితేజ (24) స్థానికంగా వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం విడుదలైన రాధేశ్యామ్ సినిమాను అతను స్నేహితులతో కలసి చూశాడు. ఈ క్రమంలోనే సినిమాకు వెళ్లి వచ్చాక బాగా లేదని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి తలుపులు తీసి చూడగా.. రవితేజ ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రవితేజ మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తన కుమారుడు ప్రభాస్ సినిమా బాగాలేదన్న కారణంతోనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రాధేశ్యామ్ సినిమాకు గత రెండు రోజుల్లోనే నెగెటివ్ టాక్ ఎక్కువైంది. సినిమా బాగాలేదని.. ప్రభాస్‌ను బాహుబలి తరువాత దురదృష్టం వెంటాడుతుందని.. సాహోలో చేసిన తప్పులనే ఈ సినిమాలోనూ చేశారని అంటున్నారు. ఈ క్రమంలో ఇంకో 4 రోజుల్లో ఈ సినిమా భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది.