గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తుండడం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి మధ్య ఈ లడ్డూ విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు తదితరాలు కలిపారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో ఏ తప్పూ జరగలేదని.. నాణ్యతకు ఏమాత్రం లోటు రాలేదని గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఈ సమయంలో టీటీడీ ఈవో శ్యామలరావు గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిశాయని బాంబుపేల్చారు.
దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు శ్రీవారి లడ్డూ వివాదంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి జంతువుల కొవ్వులు కలిపినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ప్రాయాశ్చిత దీక్ష చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంలో దోషులు ఎంత పెద్దవారు ఉన్నా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవారికి మత రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. ఈ వివాదంపై అవసరమైతే ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారని అన్నారు. ఈ వివాదంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధమేంటి అని ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం అయ్యింది దీక్షలు చేయడానికా అని ఆయన్ను ప్రశ్నించారు. భార్య క్రిస్టియన్ అని చెప్పిన పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లొచ్చా అని నిలదీశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. గత ఐదేళ్లూ సీఎంగా ఉన్న జగన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదన్నారు. అలాంటిది ఇప్పుడు సాధారణ భక్తుడిలా తిరుమలకు వెళ్తానంటున్న జగన్ ను డిక్లరేషన్ అడగడం సరైన విధానం కాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. దేవుడిని అడ్డుపెట్టుకుని మరొకరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మతం, కులాల పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యలను వీడాలి అని సూచించారు.