Restaurant Style Sweet Corn Soup : మనలో చాలా మంది సూప్ ను ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు రకరకాల సూప్ లను తాగుతూ ఉంటాము. వివిధ రకాల సూప్ వెరైటీలలో స్వీట్ కార్న్ సూప్ కూడా ఒకటి. ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తాగడానికి ఈ సూప్ చాలా చక్కగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ సూప్ ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ సూప్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – పావు కప్పు, నీళ్లు – అరలీటర్, తరిగిన క్యారెట్ – చిన్నది ఒకటి, తరిగిన క్యాబేజి – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, వెనిగర్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ – 3 టేబుల్ స్పూన్స్.
స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం..
స్వీట్ కార్న్ సూప్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం జార్ లో స్వీట్ కార్న్ ను వేసుకుని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని నీటిని పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో అర లీటర్ నీటిని పోసి వేడి చేయాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్, క్యారెట్, క్యాబేజి, మరో రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ గింజలు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పైన ఏర్పడిన నురుగును తీసేసి మరో 8 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత వెనిగర్, మిరియాల పొడి, పంచదార, ఉప్పు వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ సూప్ తయారవుతుంది. దీనిని వేడి వేడి తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సూప్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.