Soya Kurma : మనం మీల్ మేకర్ లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. మీల్ మేకర్ లతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మీల్ మేకర్ కుర్మా కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ కూరను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సోయా కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి. .అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
వేయించిన ఉల్లిపాయలు – పెద్దవి రెండు, పచ్చిమిర్చి – 2, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – పావు కప్పు, వేడి నీటిలో గంట పాటు నానబెట్టిన మీల్ మేకర్ – 50 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, టమాటాలు – 100 గ్రా., చింతపండు పులుసు – 4 స్పూన్స్, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సోయా కుర్మా తయారీ విధానం..
ముందుగా జార్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పెరుగుతో పాటు తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత మీల్ మేకర్ లలో ఉండే నీటిని పిండేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మీల్ మేకర్ లను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. మసాలాలు మాడిపోతున్నట్టుగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి.
దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత చింతపండు పులుసు వేసి కలపాలి. తరువాత వేయించిన మీల్ మేకర్, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా కుర్మా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా రుచిగా సోయా కుర్మాను తయారు చేసుకుని తినవచ్చు.