Samantha : సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ తోటి సెలబ్రిటీలకు చెందిన సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. వాటికి చెందిన అప్‌డేట్స్‌ను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెబుతుంటారు. ఇది సహజమే. అయితే ఈమధ్య కాలంలో ఓ కొత్త పంథా నడుస్తోంది. అదే పెయిడ్ ప్రమోషన్. కానీ సెలబ్రిటీలు చేస్తున్నది పెయిడ్ ప్రమోషన్ అని జనాలకు తెలియదు. దీంతో వారు ఫూల్స్ అవుతున్నారు. ఇక సమంత విషయంలోనూ ఇలాగే జరిగిందని అంటున్నారు.
తమిళస్టార్ విజయ్, పూజా హెగ్డె నటించిన తాజా చిత్రం.. బీస్ట్. ఇందులోని అరబిక్ కుతు లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవలే విడుదల చేశారు. దీంట్లో ఒక సందర్భంలో పూజా హెగ్డె నడుమును వయ్యారంగా తిప్పుతూ డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో చాలా మంది అరబిక్ కుతు సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నారు. అయితే సమంత కూడా ఈ పాటకు డ్యాన్స్ చేసింది.
ఎయిర్‌పోర్ట్‌లో టైమ్ పాస్ కోసం చేస్తున్నానంటూ.. సమంత ఈ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో సమంత వీడియో వైరల్ అయింది. ఈ పాటకు పూజా హెగ్డె వేసిన స్టెప్స్ కన్నా.. సమంత వేసిన స్టెప్సే బాగున్నాయని చాలా మంది కితాబిచ్చారు. అయితే అసలు విషయం ఏమిటంటే.. ఇది పెయిడ్ ప్రమోషన్ అట. కొందరికి సమంత షేర్ చేసిన ఈ పాట స్పాన్సర్డ్ అని ఇన్‌స్టాగ్రామ్ లో కనిపించిందట. దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెయిడ్ ప్రమోషన్ అయితే దాన్ని పోస్టులో చెప్పవచ్చు కదా.. జనాలను ఇలా ఫూల్స్ ను చేయడం ఎందుకు ? అంటూ నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఇలా చేయడం పరిపాటిగా మారింది. ఈ మధ్యే విడుదలైన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. కొందరు క్రికెటర్లు కూడా ఈ పాటకు స్టెప్పులు వేశారు. అయితే వారికి డబ్బులు ఇచ్చి అలా స్టెప్స్ వేయిస్తూ సినిమాను ప్రమోట్ చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఈ ఆరోపణలపై చిత్ర యూనిట్ స్పందించలేదు. ఇక ఇప్పుడు అరబిక్ కుతు పాటకు కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. మరి ఈ చిత్ర యూనిట్ వాటిపై స్పందిస్తుందో.. లేదో.. చూడాలి.